ఆడపిల్లలకే కాదు;
అందరికీ తెలియాలి !
మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు
ఇంట్లో 10 రోజులు కూర్చోబెట్టారు. చివరి రోజు చుట్టాలందరినీ పిలిచి ఫంక్షన్ చేశారు.
అందరితో కలిసి ఫోటోలు దిగమన్నారు. దీనికి ఇంత హడావిడి అవసరమా అనిపించింది. మా ఫ్రెండు
లత కు అయితే మెచ్యూర్ అయిన సమయం బాగోలేదంటూ పూజలు చేయించారు. ఇదంతా ఏమిటో అర్థం కాని
అయోమయం. అమ్మను అడిగితే - నీకేం... తెలియదు... ఇలాగే చేస్తారు. నోరు మూసుకో... అంది.
ఇలాగే ఎందుకు చేయాలి? చేసే ప్రతి పనికి ఒక
అర్థం ఉండాలి కదా?
ఆ తర్వాత మాపై క్రమంగా నిబంధనలు మొదలయ్యాయి. 'నీవు ఆడపిల్లవి...'
అంటూ షరతులు ప్రారంభమయ్యాయి. మగ పిల్లలతో పెద్దగా మాట్లాడొద్దు. పెద్దగా నవ్వకు, ఎగరకు,
పెద్దగా మాట్లాడకు, ఆటలు ఆడకు, తల పైకెత్తి నడవకు, అంటూ చెప్పడం మొదలైంది. ఎందుకూ?
అంటే మళ్ళీ మామూలే! 'నువ్వ ఆ... డ... పిల్లవి'... ఏమడిగినా ఒకటే జవాబు : 'నువ్వు ఆ...
డ... పిల్లవి'... 'నువ్వు ఆ...డ... పిల్లవి'... ఎందుకు పదే పదే ఇది గుర్తు చేస్తారు? మా చిన్నూ గాడు మగపిల్లాడు
కదా! వాడికి అలాగే గుర్తు చేస్తున్నారా? లేదు. అదే విషయం అడిగాననుకోండి. మళ్లీ అదే సమాధానం
: ' నువ్వు ఆ... డా... పిల్లవి'... బహుశా ఆడపిల్ల అంటే - నోరు మూసుకుని ఉండడం కాబోలు!
'ఆడపిల్లలు తొందరగా ఎదుగుతుంది.
నాలుగేళ్లు పోతే పెళ్లి చేయాలంటూ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, గాబరా పడిపోతారు. దాంతో
బాగా చదవాలన్న ఆసక్తి తగ్గుతుంది. మేము పిరికివాలన్న తయారవుతాం. అప్పటివరకు స్నేహితుల
ఉన్న మగ పిల్లలతో కలిసి మాట్లాడి, ఆట పట్టించిన మేము, వారిని చూస్తుంటే ఏదో తెలియని
మీడియం, బేరుకు మొదలవుతాయి. దూరంగా జరుగుతాం.
అప్పటివరకు ఇష్టమైన డ్యాన్స్ నేర్చుకుంటాం. ఫ్రెండ్స్
తో కలిసి చిందులు తొక్కుతాం. గుళ్ళు దగ్గర, రోడ్ల వెంట తిరుగుతూ... స్నేహితుల ఇళ్ల
దగ్గర గంటల తరబడి ఆడుకుంటాం. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి "ఇక అవి ఏమి కుదరవు"
అని అమ్మలు అంటుంటే మా మనసులు ఒప్పుకోవు. ఇప్పటివరకు ఒకలా చూసిన చుట్టుపక్కల వారంతా
అప్పటినుంచి పెద్ద వాళ్ళం అయినట్లు చూస్తారు. ఏంటో !
మాకు నిండా 13 ఏళ్లు వచ్చాయా!
ఎంచక్కా సెవంత్ క్లాసు పాస్ అయ్యి ఎనిమిది లోకి వెళుతున్న సంతోషంతో వుంటాం. కానీ మాకు
లోపల ఎదో తెలియని బిడియం వుంటుంది. ప్రతి నెలా వచ్చే నెలసరితో ఆ మూడు, నాలుగు రోజులు
స్కూలుకు ఎలా నడిచి వెళ్లాలా? అని ఆలోచిస్తాం. అయినా చదువుకోవాలన్న పట్టుదలతో ధైర్యంగా
ముందుకెళతాం.
ఎంచక్కా ఆడుతూ పాడుతూ గెంతుతూ
తిరిగే వయసులో ఈ పీరియడ్స్ రావడం ఎంటో? మాకేం అర్థం కావట్లేదు.అసలే చదువులో సతమతం అవుతుంటే
ప్రతినెలా మూడు, నాలుగు రోజులు ఈ చికాకు ఏంటో? ఇంత రక్తం పోవటం ఏంటో? దాంతో బయటకు చెప్పలేని
సమస్యలెన్నో మాకు... ఇది కేవలం మా సమస్యా? అందరికీ తెలియాలి కదా?
ప్రతి నెల పీరియడ్స్ వస్తాయని,
దాంతో కడుపులో నొప్పి వస్తుందని అప్పుడప్పుడే అర్థమవుతూ వుంటుంది. అప్పటి నుంచి మాకు
మాత్రమే అర్థమయ్యే ప్రపంచాన్ని చూస్తున్నట్లు వుంటుంది. శరీరంలో ఆవయవాల్లోనూ మార్పు
కనిపస్తోంది. కొత్త కొత్తగా ఉంటుంది. ఇంట్లో ఉన్న మగవాళ్లకు ఇవేమీ తెలియకూడదంటారు.
ఆ ప్యాడ్స్ కనిపించకుండా దాచిపెట్టమంటారు. ఎందుకు? మనం ఏం తప్పు చేశాం? ఇదంతా సహజమైన
శారీరక మర్పే కదా? నాన్నకి, తమ్ముడికీ, అన్నకీ, తెలియాలి కదా, మేమంతా పడుతున్న బాధ.
తెలిస్తే తప్పేముంది? రహస్యంగా ఉంచటం వల్ల ఉపయోగం ఏముంది ? మనవాళ్లకు అన్నీ తెలిస్తేనే
కదా, మనం మరింత బాగా అర్థం అవుతాం...
అమ్మా, టీచర్ చెప్పినట్లుగా
ముందు జాగ్రత్తగా న్యాప్ కీన్లు బ్యాగులో పెట్టుకున్నా. కాని పుస్తకాలు తీసి, పెడుతున్న
ప్రతిసారీ అది కనిపిస్తూ ఉంటే ' మాకు ప్రతి నెలా మెన్సెస్ వస్తుంది ' అని గుర్తు చేస్తున్నట్లు
ఉంటుంది. ఆ టైమ్ లో ఏదో తెలియని అసహనం.
స్కూలుకు వెళ్లాక డేట్ వస్తుంది.
అది తెలిసి వెంటనే బాత్ రూమ్ కు వెళ్లి, రక్తపు మరక చూసి కంగరుపడిన సందర్భాలెన్నో...
ఒక్కోసారి చెమటలు పడతాయి. భరించలేని నడుము నొప్పి వస్తుంది. దాంతో బాధపడుతూ ... క్లాసులో
కూర్చోలేకపోతం. అయినా మా బాధనంతా అణుచుకునేందుకు ప్రయత్నిస్తాం . ' ఇదంతా మామూలే '
అని సీనియర్ అక్కలు అంటుంటే ప్రతి నెల ఇంత రక్తం పోతుందా? అని బాత్ రుమ్ లోనే ఏడ్చుకుంటాం.
అయినా మంచి మార్కులు తెచ్చుకునేందుకు దృష్టి పెడతాం. కష్టపడి చదువుకుంటం.
ఒక వేళ డేట్ ముందే వస్తే...
ఇంకా నెల రోజులు కాలేదే అని చేతి వెళ్ల మీద తేదీ లెక్కపెట్టుకుంటం. క్లాసు పీరియడ్,
పరీక్షల టైంటేబుల్ తో పాటు ఈ డేట్ గుర్తుపెట్టుకోవడం కొత్తగా అనిపిస్తు ఉంటుంది. ఆ
టైంలో క్లాసులో కూర్చున్న ... రక్తం ఎక్కడ డ్రసుకు అంటుతుందొనన్న భయంతో టీచర్ చెబుతున్న
పాఠం మీద ఏకాగ్రత పెట్టలేం. ఇదేనేమో క్లాసులో వెనకబడటానికి కారణం అనిపిస్తూ ఉంటుంది.
చిన్న గాయమైతే పెద్దగా అరిచి,
గోల చేసి, కట్టుకట్టించుకుని, పనిచేయకుండా కూర్చొనేవాళ్లం . ఇప్పుడు శరీరంలో నుంచి
ఇంత రక్తం పోతుంటే భరించటానికే కష్టంగా ఉంటుంది. పదే పదే బాత్ రూమ్ కు వెళ్లాలంటే భయంగాను,
సిగ్గుగానూ ఉంటుంది.
స్నేహితులు గ్రౌండ్ కు వెళ్లి
ఆడుకుంటారు.వారితో ఆడనివ్వకుండా కాళ్లు ఎవరో కట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క
మగపిల్లలకు ఎన్.సి.సి క్లాసు జరుగుతుంది. వారిని చూసి మేమా అవకాశం కోల్పోయాం అని బాధ
కలుగుతుంది.
డేట్ లో ఉన్నపుడు యశోద వాళ్ల
ఇంట్లో పచ్చని మొక్కలు ముట్టుకోవొద్దని చెబుతారు.
అంటుకుంటే చెట్టు ఎండిపోతుంది
అట, కాయలు కాయవట. దారుణం కదా, ఇలా అనటం? దేవుడు గదివైపు వెళ్లొద్దని చెబుతారు. ఇంట్లో
ఏ వస్తువు తాకోధ్ధంటారు. ఎందుకూ? అంటే అంటూ, ముట్టు, చెడు రక్తం అంటూ దూరంగా ఉంచుతారు.
అయినా స్కూల్లో బాధ్యతగా అప్పగించిన చెట్టుకు నీళ్లు పోస్తం. కాని ఆ చెట్టుకేమి కాలేదు.
ఈ మూఢ నమ్మకాలను పెద్దవాళ్లు ఎప్పుడు వదిలేస్తారు? మాకు సంబంధం లేని అపవాదులని మా మీదికి
నెట్టకుండా ఎప్పుడు ఉంటారు?
మా అందరికీ తల్లిదండ్రులు,
టీచర్లు సపోర్టుగా నిలబడాలి. ఇవన్నీ భరిస్తూనే ఆటల్లో రాణిస్తున్న క్రీడామణులు ప్రతిభను
వివరించాలి. మా పరిస్థితి అర్థం చేసుకుని రెస్టు రూమ్స్ లో విశ్రాంతి తీసుకోనివ్వాలి.
మాకు మాత్రమే అవగాహన ఉంటే సరిపోదు. మాకు సహాయంగా ఉండేలా మగపిల్లలకు అవగాహన కలిగించాలి.
అన్నకు, నాన్నకు, మా క్లాసులోనీ అబ్బాయిలు అందరికీ ఈ విషయం మీద అవగాహన ఉండాలి. ఈ అంశం
అమ్మయిలది మాత్రమే కాదు; అందరిదిరిది.
0 Comments